చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి..ఓట మెరుగని కోట
నివురుగప్పి నేడు..నిదురపోతుండాది
జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! చేయెత్తి
వీర రక్తపుధార..వారబోసిన సీమ
పలనాడు నీదెరా..వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్ర పాపయ్య గూడ నీవొడూ! చేయెత్తి
కాకతీయ రుద్రమ..మల్లమాంబా..మొల్ల
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే
వీరవనెతలగన్న తల్లేరా!
ధీరమాతల జన్మభూమేరా! చేయెత్తి
నాగర్జునుడికొండ..అమరావతీ స్థూపం
భావాల పుట్టాలో..జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు!
శిల్పినని చాటావు దేశదేశాలలో! చేయెత్తి
దేశమంటే మట్టి కాదన్నాడు
మునుషులన్న మాట మరువబోకన్నాడు
అమర కవి గురజాడ నీవాడురా!
ప్రజల కవితను చాటి చూపాడురా! చేయెత్తి
రాయలేలిన సీమ..రతనాల సీమరా
దాయగట్టె పరులు..దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా!
వారసుడ నీవెరా తెలుగోడా! చేయెత్తి
కల్లోల గౌతమీ..వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి..పోంగిపొరలిన చాలు
ధాన్యరాసులే పండు దేశానా!
కూడు గుడ్డకు కొదవలేదన్నా! చేయెత్తి
ముక్కోటి బలగమోయ్..ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన..వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతి బిడ్డల పోరు మనకేలా! చేయెత్తి
పెనుగాలి వీచింది..అణగారి పోయింది
నట్టనడి సంద్రాన..నావ నిలుచుండాది
చుక్కాని బట్టారా తెలుగోడా!
నావ దరిజేర్చరా..మొనగాడా! చేయెత్తి