సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::B.వసంత,P.సుశీల,P.B.శ్రీనివాస్, V.రామకృష్ణ
తారాగణం::N.T.రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి,పద్మనాభం
పల్లవి::
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు
అవి విన్న వీనులే వీనులు
కనుగొన్న కన్నులే కన్నులూ
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు
చేపయై..కూర్మ రూపమై వరాహుడై నరహరీంద్రుడై
చేపయై..కూర్మ రూపమై వరాహుడై నరహరీంద్రుడై
దిగివచ్చెను యీ ధరణికి ఆదిదేవుడు
దైత్యుల తెగటార్చగ ఆ మహానుభావుడు
మహావిష్ణు గాధలు మధురసుధా ధారలు
బలిమితో దేవతల గెలువంగలేక
కలిమితో జన్నముల పున్నెముల కలిమితో
స్వర్గమును కాజేయ సమకట్టె
విశ్వజిద్యాగమును తాజేయ తలపెట్టె
బలిచక్రవర్తి అసుర కుల చక్రవర్తి
అనంతా అచ్యుతా మాధవా రమాధవా
ఆదుకొమ్మని ఆర్తనాదములు చేయగా
ఆదివిష్ణువే అవనికై దయచేయగా
అడుగో అడుగో..అల్లన వచ్చెను వడుగు
అలనల్లన వచ్చెను వడుగు
వాడసురల చిచ్చర పిడుగు
వేసెను బుడి బుడి అడుగు
అది వేదాలకు పట్టిన వెల్లగొడుగు
ఎక్కడిదీ పసి వెలుగు ఎవ్వరివాడో యీ వడుగు
ఏ తల్లి ఏ నోము నోచెనో ఏ తండ్రి ఏ తపము చేసెనొ
ఏ వూరు ఓ బాబు నీది..ఊరేగు వాని వూరేది
ఏ పేరు ఓ బాబు నీది..ఏ పేరు పిలిచినా నాది
ఏమి కోరెద నీవు..ఏమీయగల వీవు
మాడలా మేడలా వన్నెలా చిన్నెలా
వన్నియల చిన్నియల వలరాచ కన్నెలా
ఉట్టికి ఎక్కని పొట్టికి దక్కని
స్వర్గ సుఖమ్ములు ఎందుకులే
ముద్దూ ముచ్చట లెరుగని వడుగుకు
మూడడుగులే చాలునులే
మూడడుగులే చాలునులే
మూడడుగులే చాలునులే
ఇంతింతై వటుడింతయై అంతంతై నభమంతయై
అంతే తెలియని కాంతియై ఆగమ్య దివ్య భ్రాంతియై
విక్రమించెను అవక్ర విక్రముడై త్రివిక్రముడై
సూర్య బింబమ్మంత శోభిల్లెను
ఛత్రమై శిరోరత్నమై
శ్రవణ భూషణమై..గళాభరణమై
దండ కడియమ్మై..చేతి కంకణమై
నడుమునకు గంటయై..అడుగునకు అందెయై
పదముకడ రేణువై వటుడిటుల వర్ధిల్లి వర్ధిల్లి వర్ధిల్లి
పదునాల్గు లోకాలు పదయుగళితో కొలిచీ
ఏదీ ఏదీ ఏదీ..మూడవ అడుగు ఎచట మోపేదీ
ఏదీ చోటేదీ అని వడుగు అడుగగా
తలవంచె బలిచక్రవర్తి
పాద తలముంచె శ్రీ విష్ణు మూర్తి
విష్ణు మూర్తి..శ్రీ విష్ణు మూర్తి