చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
సాటిలేని జాతి ఓట మెరుగని కోట
నివురుగప్పి నేడు నిదురపోతుండాది
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
వీర రక్తపు ధార వారబోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ గూడ నీవోడు
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
కాకతి రుద్రమ్మ మల్లమాంబా మొల్ల
మగువ మంచాల నీ తోడ బుట్టిన వాళ్లే
వీరవనితల గన్న తల్లేరా
ధీరమాతల జన్మ భూమేరా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
నాగార్జునుని కొండ అమరావతి స్థూప
భావాల పుట్టలో జీవకళ పొదిగావు
అల్పుడను కానంచు తెల్పావు
శిల్పినంటివి దేశ దేశాల
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు
మనుషు లన్న మాట మరవబోకన్నాడు
అమర కవి గురజాడ నీవోడు
ప్రజల కవితను పాడీ చూపాడోయ్
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
రాయలేలిన సీమ రతనాల సీమరా
దాయగట్టీ పరులు దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడు నీవెరా తెలుగోడా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
కల్లోల గౌతమీ వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రా తల్లి పొంగి పొరలిన చాలు
ధాన్యరాసులే పండు దేశాన
కూడు గుడ్డకు కొదవలేదోయ్
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
ఏడుకోట్ల బలగమోయ్ ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగులోన వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
పెనుగాలి వీచింది అణగారిపోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
చుక్కాని బట్టరా తెలుగోడా
నావ దరిజేర్చరా మొనగాడా
చేయెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘనకీర్తి గలవోడా
రచన::వేములపల్లి శ్రీకృష్ణ
వేములపల్లి శ్రీకృష్ణ (1917 - 2000) ప్రముఖ కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు.
వీరు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా బేతపూడి గ్రామంలో జన్మించారు. వీరు రేపల్లె లో ఉన్నత విద్యనభ్యసించి, గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. వీరు ప్రముఖ కమ్యూనిష్టు నాయకులు పులుపుల వెంకట శివయ్య గారి ప్రోత్సాహంతో 1938లో కమ్యూనిష్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరు 1948లో గుంటూరు జిల్లా కమ్యూనిష్టు కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
వీరు 1940 దశకంలో సాంస్కృతిక ఉద్యమంలో చురుకుగా పాల్గొని గేయ రచనలోను, వివిధ జానపద కళారూపాలను వెలుగులోకి తేవడానికి సహాయపడ్డారు. 1950 దశకంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ కాలంలో "చేయెత్తి జై కొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు.
వీరు మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. మొదట బాపట్ల నియోజకవర్గం నుండి 1952లోను, తరువాత 1962 మరియు 1972 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి శాసనసభ్యులయ్యారు. 1964-65 విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమంలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వీరు 1968 నుండి 1972 వరకు విశాలాంధ్ర దినపత్రికకు సంపాదకత్వం వహించారు. హైదరాబాదులోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు ఏప్రిల్ 8, 2000 న హైదరాబాదులో పరమపదించారు. మరణానంతరం తన నేత్రాలను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు.
వికీపీడియా నుండి సేకరించిన విషయాలు