సంగీతం::సుసర్ల దక్షణామూర్తి
రచన::సముద్రాల,శ్రీశ్రీ కోసరాజు
గానం::ఘంటసాల గారు
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,L.విజయలక్ష్మీ,S.V.రంగారావు.
::::
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు
ఎవ్వాని వాకిట..ఎవరి వాకిట్లో..ఇభ..ఏనుగుల..మద..మద ధారల చేత ఏర్పడిన
పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల,
రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో)
ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై
గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు
గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు
వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన
సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల
సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు అంతటా ప్రాకుతున్నాయో
అతడు - ధర్మరాజు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు
కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాజుకు కొడుకైన యుధిష్టిరుడు.
ధర్మరాజు వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.
అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా... కాదు. స్వయానా యమధర్మ రాజు కొడుకు అని అర్థం. అంటే ధర్మానికి ప్రతీకే ధర్మరాజు అని చెప్పడమే.
ఇది తిక్కనగారి పద్యము. ఈ మాట ద్రౌపది భీమార్జునలతో అంటుంది. నర్తనసాల సినిమాలో మాత్రము అర్జునుడు(బృహన్నల) ద్రౌపది, భీముడితో ధర్మరాజు గురించి చెప్పిన పద్యము.