Friday, January 18, 2013

స్వర్గీయ శ్రీ నందమూరితారకరామారావుగారి వర్ధంతి సందర్బంగా నివాళి అర్పిస్తూ






















































విశ్వ విఖ్యాత సార్వభౌమ - నందమూరి తారకరామ

రచయిత:::కొంపెల్ల శర్మ::: బ్లాగు:::తెలుగురథం     
టపా తేది: 19-01-09 17:07:00



విశ్వవిఖ్యాత సార్వభౌమ - నందమూరి తారకరామ




(మే 28, 1923 - 18 జనవరి, 1996)
'ఆంధ్రజాతికెవడు - ఆత్మగౌరవముద్ర, ఆనవాలు తెచ్చినట్టి ఘనుడు! మేటి నాయకుండు - మేధావి - తేజస్వి రామారావు తెలుగు సీమలోన, యావదాంధ్రమునకు - జీవత్ పతాకమై, తెలుగు వెలుగు సర్వదిశల నింపి, నట వరుండు బ్రదికె నవ్యాంధ్ర భోజుండు రామారావు సార్వభౌముడగుచూ అని ప్రముఖ కవి నండూరి రామకౄష్ణమాచార్య, నందమూరి తారకరామారావుగారి గురించి, 'దేశభాషలందు తెలుగు లెస్సా అన్న తెలుగు సంస్కౄతీ, సాహిత్య, సమగ్ర, సంక్షిప్త సంకలనం, అన్నగ్రంధంలో వివరించారు.
అందరికీ మార్గదర్శి


రాజీ పడని సైనికుడు, నట, రాజకీయ సార్వభౌముడు. ఆయన మార్గం అనితరసాధ్యం. ప్రపంచంలోనే ఒక అపురూపమైన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును పొందిన మొదటి తెలుగువాడు అని చెప్పక తప్పదు. తెలుగువాడికి మదరాసి, లేక దక్షిణాదివాడు అనే ముద్ర వుండేది. దానిని పోగొట్టి ఆంధ్రావనిలో ప్రతి తెలుగువ్యక్తికి తెలుగువాడికి గౌరవాన్ని, ప్రత్యేకతను, వాడిని, వేడిని, తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా ఆయనదే. క్రమశిక్షణకు, కౄషికి, దీక్షకు,మారుపేరుగా పేర్కొనక తప్పదు. నిరంతరం ఆయన కౄషీవలుడే. ప్రజలు ఎప్పుడు ఆపదలో వున్నా, విపత్కర పరిస్థితులలో వున్నా ముందుకొచ్చి ఆపన్నులను ఆదుకున్న మానవతామూర్తి. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా తన సహాయం అవసరమనుకుంటే ముందుండి నాయకత్వం వహించేవారు. నాలుగు దశాబ్దాల కళాసేవ తర్వాత, ఆయన మనసు ప్రజాసేవవైపు మొగ్గింది. తిరుగులేని కళాకారుడిగా తనను యింత స్థితికి తీసుకువచ్చిన తెలుగు ప్రజానీకానికి సేవ చెయ్యాలనే నిర్ణయం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మెరుపులా వచ్చిందని చెప్పవచ్చు. తెలుగు మహానుభావుల చరిత్రకు చిత్రరూపం లో వారి పాత్రలోనటిస్తూ, లీనమవుతూ జీవిస్తున్నప్పుడు, ఈ నిర్ణయం నిఖార్సుగా తీసుకోవడానికి అనువైన బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. నటనలో నటసార్వభౌముడు, రాజకీయరంగంలో విశ్వవిఖ్యాతుడు గా విరాజిల్లిన కొదమసింహం, బొబ్బిలిపులి. ఆయన ఒక సుడిగాలి. వెరసి ఆయన అతిస్వల్ప కాలంలో ప్రపంచం దౄష్టిలోకి వచ్చారు. అందరూ చెప్పుకునే అహం, వారికి ఆత్మగౌరవం. ఆయన కోపం, ప్రక్షాళనగా మారుతుంది. ఆయన ఆవేశం, దానిపేరు చైతన్యంగా రూపుదిద్దుకుంటుంది. ఆయన పట్టుదలకు అసంఖ్యాక తార్కాణాలతో, ఒక బౄహద్గ్రంధం అవుతుంది. ఆయన మాట ఒక శ్లోకం. ఆయన పర్యటన ఒక దుమారం. ఆయన నిర్ణయాలు, రేపిన పలు సంచలనాలు. ఆయన ఆలోచనలు, విప్లవాలుగా పల్లవిస్తాయి. ఆయన ప్రతిచర్య ఒక ప్రయోగంగా రసాయనప్రక్రియగా మారుతుంది. అందుకే ఆయన విశ్వవిఖ్యాతుడు. నటనాసార్వభౌముడు. రాజకీయరారాజు. వెరసి, ఆయన విశ్వవిఖ్యాత నట రాజకీయ సార్వభౌముడు. ఆయనపేరు - నందమూరి తారక రామారావు. ఆంగ్లంలో యన్.టి.రామారావు. క్లుప్తంగా, యన్.టి.ఆర్. ఆంధ్రగ్రామీణప్రజలకు, చిత్రప్రేమికులకు నందమూరి అభిమానులకు యంటీవోడు. యిది ఈయన పరిచయం.


నిమ్మకూరు నిప్పు
1942-44 మధ్యన ఆంధ్ర నాటక పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో నాటకాలు జరుగుతున్నాయి. ప్రజా నాట్యమండలి, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తరఫున పోటీలు జరుగుతున్నాయి. వాటిల్లో ప్రదర్శించిన 'చేసినపాపం' అన్న పౌరాణిక నాటకంలో ఒక అందమైన యువకుడు అభినయిస్తున్నాడు? ఎవరీతను అనుకున్నారు అందరు. అతనే నందమూరి తారక రామారావు. కౄష్ణాజిల్లా, నిమ్మకూరు గ్రామంలో 28 మే 1923 న జన్మించారు. ఆంధ్ర క్రీష్టియన్ కాలేజీ, గుంటూరు నుంచి పట్టభద్రుడు. సబ్-రిజిస్టారుగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన, రామారావు, కవిసామ్రాట్, జ్ణానపీఠం సన్మానం పొందిన విశ్వనాధ సత్యనారాయణగారికి ప్రియశిష్యుడు. బసవరామతారకం ను వివాహమాడిన ఈయనకు 12 మంది సంతానం. ఈ నేపథ్యంలో ఈయన కుటుంబనియంత్రణ విధానం పై వ్యతిరేకంగా 'తాతమ్మకలా చిత్రం తీయడం, దానికి ఉత్తమకధాచిత్రంగా ప్రభుత్వంనుంచి ప్రశంసాబహుమతులను అందుకోవడం విశేషం, వింత అని చెప్పాలి. పెద్దకొడుకు రామకౄష్ణ మరణించిన తర్వాత, అతని పేరున, స్వంత చలనచిత్రసంస్థను ప్రారంభించాడు. 1949లో మనదేశం చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేశాడు.
నందమూరి నటనాపర్వం


నందమూరి చిత్రాభిమానులకు నటసార్వభౌమ అనే పిలుచుకుంటారు. పౌరాణికపాత్రలకు ఆయన పేరునే మొదటి గుణికం చేయాలి. దక్షిణభారతచిత్రాల్లో తెలుగు చిత్రాలకు వచ్చిన ప్రాధాన్యతకు కారకులను చెప్పాలంటే, ఈయనను ప్రప్రధమంగా పేర్కొనాలి. ప్రముఖ నిర్మాత, విజయసంస్థనేత బి.నాగిరెడ్డి సౄష్టించిన కౄష్ణుడు పాత్ర (మాయాబజార్), ఆయన చలనచిత్రజీవితంలో మొదటిదశలోనే ఒక మైలురాయి అని చెప్పాలి. విష్ణువు దశావతారాల్లోని, రామ, రావణ, కౄష్ణ, అర్జున, కర్ణ, భీమ, దుర్యోధనాది పౌరాణిక పాత్రలు ఆయన ముఖవర్చస్సుని పూర్తిగా మార్చివేశాయి. ఆ అవతారామూర్తుల రూపం, నందమూరిలాగానే వుంటాయన్న విశ్వాసం, సిద్ధాంతం నిర్మించుకున్న జాతి, తరం, కేవలం ఆంధ్రసీమలోనే కాదు, యితరరాష్ట్రాల్లోకూడ, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో, చాలా ఎక్కువగా చూస్తూంటాము. తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఆయన అందించిన వరప్రసాదంగా భావించే స్థానాన్ని వర్ణించాలంటే, 1950-65 మధ్య కాలం స్వర్ణయుగం అని చెప్పాలి. విశ్లేషకుల భావన ప్రకారం, తెలుగుదేశంలో ప్రాముఖ్యమైన పౌరాణికచిత్రాలను నిర్మిస్తే, తమిళ, హిందీ చలనచిత్ర పరిశ్రమలు ప్రభావితమైన సాంఘికయితివౄత్తచిత్రాలను అందించింది. రామారావు దక్షిణభారతచిత్రాల్లో ప్రముఖస్థానం పొందాడు అన్నది నిర్వివాదాంశం. తెలుగుసీమ కూడ ఒకప్పుడు అంతర్భాగంగా వున్న తమిళనాడు చిత్రపరిశ్రమలో అధ్బుతనటనాకౌశలం ప్రదర్శించడంలో శివాజీగణేశన్, సామాన్య ప్రజానీకానికి ప్రేరణగా, వ్యాపారాత్మకంగా, నటనలోనూ పేరుతెచ్చుకున్న మెగాస్టార్ యం.జి.రామచంద్రన్,లు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి పంధాలో సమతులనం చేసుకున్న పద్ధతిలో తనదైన నటనాపధాన్ని, స్వీయపంథాన్ని నిర్మించుకున్నాడు రామారావు. శివాజీయే చెయ్యగలడన్న పౌరాణికాలు, యం.జి.ఆర్. మాత్రమే నప్పగలడన్న వ్యాపారధోరణిలోని జానపదచిత్రాలు, రెంటినీ సవ్యసాచిలా ప్రతిభావంతంగా రాణించగల నటనాసామర్ధ్యంగల నటుడు ఒకే ఒక్కడు, అతడే, తారకరాముడు.
ఒకే ఒక కౄష్ణుడు, ఆయనే రాముడు
నందమూరి నటనలో ప్రత్యేకంగా 'నభూతో నభవిష్యతీ అంటే నందమూరే అన్నట్లు రాణించిన పాత్ర, కౄష్ణుడు. తెలుగు చిత్రాల్లోనే కాకుండా, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడ, కౄష్ణుడిపాత్ర మాత్రం రామారావునే వరించేది. మిగతా, కర్ణ, అర్జున, భీమాది పాత్రలు, యం.జి.ఆర్., శివాజీ, రాజ్ కుమార్ లు నటించేవారు. ఈ కౄష్ణపాత్ర మాత్రం నందమూరి నటనాజీవితానికి ఒక అర్ధం, పరమార్ధం, ప్రసాదించాయి అన్నదాంట్లో ఆశ్చర్యం లేనేలేదు. కౄష్ణుడిపాత్రతో పాటు, రామ, భీమ, దుర్యోధన, కర్ణ, రావణాసుర, యమ, అర్జున, శివ, విశ్వామిత్ర, వేంకటేశ్వర, లాంటి పౌరాణిక పాత్రలను పాత్రలే ఆయన, ఆయనే పాత్రలు అన్న పంథాలో నటననుప్రదర్శించారు. అలాగే, చారిత్రకాలైన, శ్రీనాధుడు, ఆశోక, వివేకానంద, పోతులూరి వీరబ్రహ్మం, పాపారాయడు, సలీం, చాణక్య, తిమ్మరుసు, శ్రీకౄష్ణదేవరాయలు, పాత్రలు బహుళ ప్రజాదారణకు నోచుకున్నాయి. యివికాక, ఎన్నో జానపదాలు, సాంఘికాలు, కుటుంబయితివౄత్తాలు, అన్నీ కలిపి, 280 కి పైగా చిత్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు.
వైవిధ్యాలు, నందమూరి నటనాపాత్రలు


రామారావు నటించిన, కాదు, జీవించిన ముఖ్యమైన పాత్రలను క్రోడీకరించాలంటే, ప్రప్రధమంగా, శ్రీకౄష్ణ పాత్రలో - మాయాబజార్, శ్రీకౄష్ణార్జునయుద్ధం, శ్రీకౄష్ణరాయబారం, శ్రీకౄష్ణసత్య, కర్ణ చిత్రాల్లో నటనావైదుష్యాన్ని ప్రస్తావించాలి. లవకుశ (శ్రీరామ), భీష్మ (భీష్మ), భూకైలాస్ (రావణ), నర్తనశాల (అర్జున, బౄహన్నల), పాండవవనవాసం (భీమ), శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం (శ్రీ వేంకటేశ్వర), మహామంత్రి తిమ్మరుసు (శ్రీకౄష్ణదేవరాయలు), దానవీరశూరకర్ణ (దుర్యోధన, శ్రీకౄష్ణ, కర్ణ), అయిదు పాత్రలతో విరాటపర్వం, ముఖ్యంగా చెప్పాలి. మరింత ప్రత్యేకతలున్న జానపదచిత్రాలు - జగదేవవీరునికథ, పాతాళభైరవి, భట్టివిక్రమార్క చెప్పుకోతగ్గవి. సాంఘికయితివౄత్తాలైన - మల్లీశ్వరి, కన్యాశుల్కం, గుండమ్మకథ, మిస్సమ్మ, రక్తసంబంధం, రాముడు-భీముడు, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటిసింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, ప్రస్తావించకతప్పదు. ప్రత్యేకశైలిలో అవతరించిన పాత్రలు - బడిపంతులు, రాజు-పేద, ఆత్మబంధువు, చిరంజీవులు, లాంటివి ఎన్నో ప్రస్తావించాలి. గుడిగంటలు చిత్రంలో ప్రతినాయకుని పాత్రలో తాదాత్మ్యం చెంది నటించడం, (జన్మమెత్తితిరా, అనుభవించితిరా), అన్నాచెల్లెళ్ళ అనురాగ పాత్రలకు అప్పటికీ, యిప్పటికీ, అద్దం పట్టినచిత్రం, రక్తసంబంధం, కన్యాశుల్కం లో గిరీశం పాత్రలో నటన కాకుండా జీవించడం, కేవలం ఉదాహరణలు మాత్రమే.



నందమూరి నటుడే కాదు - దర్శకుడు, నిర్మాత.
స్వంతచిత్రం మొదటిసారి సీతారామకళ్యాణం(1961) నుంచి, వరసగా, గుళేబకావళికధ, శ్రీకౄష్ణపాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామా, తాతమ్మకల, దానవీరశూరకర్ణ, చణక్యచంద్రగుప్త, శ్రీరామపట్టాభిషేకం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీతిరుపతి వేంకటేశ్వరకళ్యాణం, శ్రీమద్విరాటపర్వం, చండశాసనుడు, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్ చిత్రాల్లో, తన అద్భుతదర్శకప్రతిభను ప్రదర్శించి ఎప్పటికీ మదిలో నిలచిపోయేలా వాటిని మలిచారు. గుళేబకావళికధ చిత్రానికి, ప్రముఖకవి సి.నారాయణరెడ్డిగారిని, చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత రామారావుకే దక్కుతుంది. నన్నుదోచుకుందువటే, వన్నెలదొరసాని, అని తనమధురకలంతో చిత్రసీమలో కాలిడిన సినారె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అలాగే, ప్రముఖ హిందీచిత్రగాయకుడు, మహమ్మదురఫి ని తెలుగుచిత్రసీమకు (భలేతమ్ముడు, అక్బర్ సలీం అనార్కలి) పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. అంతేకాక, చిత్రసీమలోని అందరికీ ఆయన స్ఫూర్తి, ప్రభావితం, ప్రేరణాత్మకం, మార్గదర్శి, ఆయన బాటలో నడచిన వారు ఎందరో, మరెందరో, మహానుభావులుగా, తదుపరి గుర్తింపు తెచ్చుకుని, వారు కౄతజ్ౙతని ప్రతినిత్యం చెప్పుకుంటుంటారు. కొండవీటివెంకటకవి లాంటి ప్రతిభాకవిని చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కూడ నందమూరిదే. రామారావు నిర్మించిన, దర్శకుణ్ణి ప్రకటించకపోయినా, ఆయన చిత్రం సీతారామకాళ్యాణం కు ఆయనే దర్శకత్వం వహించినా, ఎక్కడా ఆయన పేరు మనకు కనిపించదు. కేవలం, నిర్మాత, త్రివిక్రమరావు (సోదరుడు) అనిమాత్రం ప్రకటించడం విశేషం. సినీమాకు ఆయనే దర్శకుడన్నది అందరికీ తెలిసినదే. ఈ చిత్రంలో రావణాసురుని, కాదు, రావణబ్రహ్మ, పాత్ర గురించి, గొప్ప పరిశోధనచేశారు నందమూరి. విదేశాల్లో గొప్ప పేరు పొందింది. యింక ఈ చిత్రంలో సీత పాత్రని 'గీతాంజలీ చేత అభినయించిన తీరు సీత అంటే యిలాగే అని పలువురుకి అనిపించింది. ఈయన నిర్మించిన ఉమ్మడికుటుంబం, సర్వకాలానికి ప్రాతినిధ్యం వహించే కుటుంబస్థితిగతుల్ని, కుహనా బాబాల లీలల్ని (ఓం సచ్చిదానంద, శ్రీసర్వం గోవిందా), పరోక్షంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రారంభంగా 'కర్టెన్ రైజఋ గా, అసలు కధను అందరూ గమనించాలన్న ఉద్దీశ్యంతో, యమధర్మరాజు, సతీసావిత్రిల సంగీతరూపకం, బహుళప్రజాదరణకు నోచుకోవడంలో రామారావు ప్రతిభ తేటతెల్లమవుతుంది. నందమూరి చిత్రంగా, తాతమ్మకల, చిన్నకుటుంబం - చింతలు లేని కుటుంబం అన్న ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకంగా, దేవుడిచ్చిన సంతానాన్ని నిరోధించకూడదన్న ఆలోచనతో, మహానుభావులందరూ అధికసంతానంలో భాగమని, సోదాహరణంగా, వివరించిన చిత్రానికి ప్రభుత్వ బహుమతి లభించడం కూడ మరచిపోలేని కధనం. దానవీరశూరకర్ణ, ఒక ప్రత్యేక వరవడితో తీసిన చిత్రం. ఆయన చిత్రాల్లో, కధకు, పాటలకు, సంగీతానికి, మాటలకు, అర్ధాలే కాకుండా, అంతరార్ధాలు, ప్రాసలు, అనుప్రాసలు, భాయయుక్తంగా, కవిహౄదయం కొండవీటి వెంకటకవి సంభాషణల్లోనే కాక, రామారావు మాటల్ని, భావాల్ని పలికినతీరు నిత్య స్మరణీయం అని వెల్లడవుతూంటుంది. సినారె లాంటి కవులు రామారావు చిత్రాలకు ప్రాణాలు పోశారన్నది సత్యం.
చిత్రపరిశ్రమ లో విశిష్టవ్యక్తిత్వం



వైవిధ్యమున్న పాత్రలను నటించిన ఘనత నందమూరిదైతే, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన నటన మోతాదు కొంచెం ఎక్కువనే అభిపాయాన్ని విశ్లేషకులు చెప్పడం కూడ జరిగింది. ఈ చిన్న విమర్శ చిన్న తుంపరలాంటిది. తుంపర,మహాసముద్రం ముందు ఏపాటిది? ఆయన ఏ పాత్ర ధరించినా, ఆ పాత్రను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని నటించడం, పాత్ర స్వరూప స్వభావాలను బట్టి మానసికంగానే కాక శారీరకంగా కూడా ఆ పాత్రలో ఇమడటానికి ప్రయత్నించడం (భీమ పాత్రలో బాగా తిని కండలు పెంచడం), పేదవాడిపాత్ర కు తిండి మానేసి బక్కగా మారే ప్రయత్నం, ఏకాగ్రతతో పాత్రలో లీనమై నటించడం, క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ప్రవర్తించడం, కొన్ని పాత్రల్లో ఆవహించి, పరకాయప్రవేశం చేసి నటిస్తున్నారా అన్న భావనలు, నిర్మాత, దర్శకుడు అయినాకూడ, సాటి దర్శక నిర్మాతలకు యిచ్చిన గౌరవ మర్యాదలను చెప్పలేమని చిత్రసీమ మొత్తం పలవరిస్తూనే వుంటుంది. దర్శకునికి యిచ్చిన విలువలు, నిర్మాత క్షేమాన్ని సదా కాంక్షించడం, పచ్చగా వుంటేనే చిత్రరంగం కళకళలాడుతుంది అన్న ఖచ్చితమైన అభిప్రాయం, ఇలా ఎన్నో విశిష్ట విధానాలని, శైలిని పాటించిన ప్రజ్ౙానాభినయ వైభవమూర్తి.
కళాసేవ నుంచి రాజకీయానికి



ప్రేరణకు కారణం ఏమిటి? కారణాలు అనేకం కావచ్చు. కొన్ని కారణాలకు మాటలు వుండచ్చు, లేకపోవచ్చు, వున్నా నోటినుంచి మాటలు రాకపోవచ్చు, కేవలం అనుభూతులే ప్రేరణకు దారితీస్తాయి. ఈ పంధాలోనే కలిగిన ప్రేరణ, నందమూరిని కళాసేవ నుంచి రాజకీయరంగానికి మరలిరావడం జరిగింది. ఒక సమావేశంలో, ప్రజల్లోని ఒక సామాన్యుడు, అభిమాని అడిగిన ప్రశ్న, అయ్యా, మేము మిమ్మల్ని దేవుడిలాగ ఆదరించాము; కాని మీరు మాకు ఏమి చేశారు? అన్న ప్రశ్న నందమూరి హౄదయంలోకి సూటిగా గుచ్చుకుంది. నరనరాల్లోకి ప్రవేశించింది. రక్తప్రసరణలో భాగంగా మారింది. ఆలోచనగానూ మారింది. ఆలోచనకు ఆచరణయోగం కలిగింది. ఫలితంగా, 29 మార్చి 1982 న 'తెలుగుదేశం' ఆవిర్భావం అంధ్రసీమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. తెలుగుదేశం ప్రారంభం వెనుక, కేవలం రాజకీయప్రవేశ లక్ష్యమే కాదు. తరతరాలుగా తెలుగువాడికి దక్కుతున్న గౌరవం, మర్యాదలను బేరీజు వేసుకుని, తెలుగువాడి ఆత్మగౌరవం ఒక అంతస్సూత్రంగా ఆవిష్కరించబడింది. జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి మర్యాదను పెంచిన నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశాన్ని స్థాపించిన కేవలం 9 నెలలుగా రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయాన్ని సాధించి, ఒక చరిత్రను సౄష్టించారు. ఆయన ప్రచారవాహనానికి చైతన్యరధం అని నామకరణం చేసి, 9 నెలల్లో, 18 వేల కి.మీ. సుడిగాలిలా పర్యటించాడు. దినచర్యలు, కాలకౄత్యాలు, అన్ని రహదారిలోనే, చైతన్యరధం ప్రక్కనే. ఆయన పర్యటన పూర్తిచేసుకునే, యింటిముఖం పట్టాడు. మరొక ముఖ్య విషయం, రాజకీయంగా ఎన్నో ఏళ్ళుగా ప్రబలుతున్న విధానం - ఢిల్లీ నుండి నిర్ణయాలు హైదరాబాదు అందటం మానిపించి, హైదరాబాదు నుండి ఢిల్లీలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన వ్యక్తి నందమూరి. కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీని, కేవలం తాను పార్టీ ఏర్పరచిన ఏడాది లోపునే మట్టికరిపించిన కళావంతుడైన రాజకీయవేత్త ఆయన. ఆయనలోని కళాకారుడు కేవలం నటనకేకాదు. రాజకీయాన్ని కూడ కళాత్మకంగా నడిపించగలడు అని నిరూపించిన మహానుభావుడు. ఫలితంగా, 202 సీట్లు సాధించి, జనవరి 9, 1983 న తారకరాముడు రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయన చిత్రాలు మాదిరి, రాజకీయల్లోకి ఆయన ప్రవేశం, ప్రచార పర్యటన, ఎన్నికల్లో గెలవడం, శాసనసభలో ప్రవేశించడం, అన్ని చిత్రంలానే విచిత్రంగా జరిగిపోయాయి. ఆయనతోపాటు గెలిచిన వాళ్ళు ఎక్కువగా, అనుభవం లేనివారే. ఒక్క నందమూరే వారిని సముదాయించ వలసివచ్చింది. ముఖ్య కారణాలైన, ఎక్కువకాలంగా కాంగ్రెసు కి ప్రత్యామ్నాయం లేకపోవడం, అభివౄద్ధి అనుకున్నంతగా రాకపోతూండడం, నిరుద్యోగం, ఒకే రాజకీయ పక్షం, కులం సుదీర్ఘకాలం అధికారంలో వుండడం, యీవన్ని, తెలుగుదేశానికి దారితీసాయి. ప్రముఖ దిన పత్రిక ఈనాడు అధిపతి చేకూరి రామోజీరావు అండదండలు, తానే స్వయంగా గుడివాడనుంచి పోటీచేయడం, ఆనాటి ప్రముఖఘట్టాలు. ఎన్నికలు మొదటిసారి గెలిచాక, ఆయన స్వామి వివేకానంద రూపంలో ప్రత్యక్షమయి, ప్రభుత్వాన్ని ఆదర్శభావాలతో నడపడం ప్రారంభించినా, అవి అనుకున్నంత ప్రభావాన్ని, ఫలితాల్ని యివ్వలేకపోయాయి. తెలుగుదేశంలో కూడ, క్రమేపీ రాజకీయాలు ప్రవేశించడం, నాదెండ్ల భాస్కరరావు రాజకీయ కుతంత్రానికి ఆయన అనుభవించిన శౄంగభంగం, ఎన్నికలను కొత్తగా 1985 లో జరిపించారు. రామారావు తీసుకున్న ముఖ్య పొదుపు చర్యల్లో భాగంగా, కౌన్సిల్ ను రద్దు చేయడం, 1989లో పొందిన అపార అనుభవం, యిద్దరు అల్లుళ్ళు, చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను ఆయన చేరదీయడం జరిగింది. విద్యారంగంలో రామారావు తెచ్చిన మార్పులు ఎన్నో, మొత్తం సిలబస్ లను మార్చడం, యింజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా, యం.బి.ఎ. తరగతులకు ప్రవేశపరీక్షను ప్రవేశపెట్టినది ఆయనే. హిందీలో అంత ప్రావీణ్యం లేకపోయినా, హర్యానాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఏకధాటిని 45 ని. పాటు ప్రసంగం చేసి, ప్రసంగాన్ని బట్టీయం చేశానని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచారు. ఆయన జ్ౙాపకశక్తికి ఆయన పౌరాణిక చిత్రాల్లోని సుదీర్ఘసంభాషణలే తార్కాణం. సుస్పష్ట ఉచ్చారణ, స్వచ్చమైన భావప్రకటన, హావభావాలు, ఆయనకు వెన్నతోపెట్టినవిద్యయే కదా. 1989లో ఎన్నికల్లో పరాజయం పొందినా, ఆయన ప్రతిభను జాతీయస్థాయికి తీసుకువెళ్ళి, ప్రాంతీయపక్షాలని ఏకత్రాటిపై తేగలిగారు. జనతాదళ్ లాగున, కేంద్రస్థాయిలో నేషనల్ ఫ్రంట్ ని స్థాపించారు. కాంగ్రేసుకు ప్రాంతీయస్థాయిలో వేరే ఏమిటి అన్న ఆలోచనకు రామారావే సమాధానం చెప్పగలిగారు. 1994 లో తిరిగి పదవిలోకి వచ్చినప్పుడు, రెండురూపాయలకు కిలో బియ్యం, తాగుడువ్యవస్థనుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్న సంకల్పంతో చర్యలు, ప్రభుత్వానికి పెనుభారం అయినా తన అలోచనలో మార్పు రానీయలేదు.


1989 నుండి 94 వరకూ ప్రతిపక్షంలో వున్న నందమూరి 1994 డిసంబర్, 12 న తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. 1983, 84, 85, 94 లలో మొత్తం అయిదు సార్లు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే. 1995లో శాసనసభ్యుల తిరుగుబాటు వలన రామారావు పదవి కోల్పోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలే కాక కేంద్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. కాంగ్రేసు వ్యతిరేక పార్టీలన్నిటినీ నేషనల్ ఫ్రంట్ క్రింద ఏకం చేశారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. తెలుగు భాషాభివౄద్ధికి అవిరళకౄషి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన కలలకు ప్రతిరూపమే.


బాధల పర్వం - ఆఖరిదశలో కష్ట పరంపరలు
క్రమేపీ తెలుగుదేశంలో కష్టాల కడలి కదలింది. పార్టీలో సమస్యలు అంకురించాయి. అల్లుడు, చంద్రబాబు, జామాత, ఒక్కసారి దశమగ్రహంలా విజౄభించాడు. రామారావుకు అన్ని సమస్యలను ఒక్కసారి బాణంలా విసిరాడు. తిరుగుబాటు బావుటాని ఎగరవేశాడు. తెలుగుదేశం రెండు ముక్కలైంది. రామారావు ప్రజల్లోకి న్యాయానికి పోయినా, ఆఖరుకు చంద్రబాబు వైపుకే కడలి కదలింది. టాంకుబండ్ వద్ద రామారావు నిరహారదీక్ష జరపడం కూడ నాటకీయంగానే జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. యిదే రామారావు రాజకీయనాయకునిగా చరమఘట్టం అని భావించవచ్చు.


కధకు, కధనానికి ముగింపు
నందమూరి తారక రామారావు జీవితంలోని ముఖ్యపర్వాలైన, నటన రాజకీయంగా ముగియలేదు. కాని రాజకీయం మాత్రం నాటకీయంగానే ముగిసింది. అధికారం చేజారడం, తర్వాత ఘటనలు, సినీమాలో అంతిమఘట్టాలుగానే జరిగాయి. నటనలో అమితాభిమానాన్ని పెంపొందించుకొని, తన పరిశోధనాంశం కూడ, నందమూరినే ఎన్నుకుని, ఆయన సాన్నిహిత్యంలోనే తన జీవితాన్ని గడపడానికి వచ్చి, రామారావునే వివాహమాడిన లక్ష్మీపార్వతి, నందమూరి జీవనచిత్రంలో ఆఖరిపాత్ర అనే చెప్పాలి. జరిగిన సంఘటనలకు ఆమె కూడ చాలవరకు బాధ్యురాలని పలువురి భావన. ఆమె రామారావు జీవితంలోకి ప్రవేశించాక, ఆయనలో చాలా మార్పులు, కుటుంబంలో కూడ కుతకుతలు, దూసుకువచ్చిన అనారోగ్యం, వెరసి, ఆయన తుది ఘడియలు ప్రవేశించాయి. రామారావు తన తుది శ్వాసని, జనవరి 18, 1996 న విడిచారు. లక్షలాది మంది ప్రజాసమూహం ఆ సార్వభౌమునికి నివాళి అర్పించేందుకు వరసలు కట్టి ఆయనను రాజలాంఛనాలతో సాగనంపారు. ఘననివాళ్ళను సమర్పించారు.
ఏ చిక్కులూ, యే యిబ్బందులూ లేకుండా యీ ప్రప్రంచంలో సుఖంగా బతకాలంటే కొంత నటన అవసరం అంటారు. రంగస్థలంపై, చిత్రాల్లో నటించగలవాళ్ళూ జీవితంలో నటించలేరు; జీవితంలో నటించగలవాళ్ళు చిత్రరంగస్థలాల్లో రాణించలేరు; జీవితంలో నటించగలవాళ్ళు లౌక్యులు; తమ వౄత్తుల్లో రాణించగలవాళ్ళు నటులు. నటన జీవనోపాధి అయితే పరవాలేదు; కాని ప్రాణాలతో చెలగాటం కాకూడదు. ఏది ఏమైనా జీవితంలో బతక నేర్చినవాడు ఉత్తమనటుడు.

రాజకీయమనేది మన బ్రతుకులకు ఊపిరిలాంటిది అంటాడు శ్రీశ్రీ. అయినా, రాజకీయాల్లో పెద్దపాము చిన్న పాముల్ని నిర్దాక్షిణ్యంగా మింగటంద్వారానే పైకి ఎగబాకుతుంది. జనాలకు వాగ్దానాలు చేయడం, రాజకీయనాయకుని ప్రధాన కర్తవ్యం; అది తిరిగి తీర్చకపోవడమన్నది వారి సహజ లక్షణం. ఒకసారి గొడవొచ్చి విడిపోయాక అప్పటివరకూ కలిసి పనిచేసినవారిమీద బురదజల్లటాన్నే 'రాజకీయం' అంటాడు యండమూరి వీరేంద్రనాధ్. రాజకీయాల్లో ప్రత్యర్ధుల్ని మిగల్చకూడదు. పై వాళ్ళని నమ్మకపోవడం, కిందివాళ్ళను నమ్మకపోవడం, అదే రాజనీతి. అసలైన అబద్ధాలకంతులెరిగి అరచేతిలో స్వర్గం చూపువాడే ఆరితేరిన అసలు రాజకీయవేత్త. రాజకీయవేత్తలు కొలంబసులా తయారవుతున్నారు. ఎక్కడ బయలుదేరతారో తెలియదు; ఎక్కడికి వెళ్ళాలో తెలియదు; ఎటు చేరతారో తెలియదు. పైగా కొలంబసులాగే డబ్బు కూడా వీళ్ళది కాదు, అని అంటారు శ్రీరమణ.

అల్లుడ్ని నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని, కొడుకుని నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని లోకంలో ఎప్పుడైనా బాగుపడ్డాడా? అని పతంజలి అన్యాపదేశంగా, యదార్ధాన్ని చెప్పకనే చెప్పారు. అల్లుడికి అల్లుడు వచ్చి, రాజకీయంలో జోక్యం చేసుకుంటేనేగాని, తెలియదు. అల్లుడులేనివాడికి, రాజకీయం వేరేలా దెబ్బతీస్తుంది.
నందమూరి తారకరామారావు తన నటనద్వారా, రాజకీయాలద్వారా, అందించిన సందేశాలు, ఆలోచనలు, భావాలు, ఆయన స్థాపించిన తెలుగుదేశంద్వారా నెరవేరుతాయని ఆశిద్దాం. మహానాడుల్లో తీసుకుంటున్న మహానిర్ణయాలు, వాటి మహత్వపూర్ణత, ఎంతవరకూ ఆచరిస్తున్నారో ప్రజలకు, వారు నమ్ముకున్న తెలుగుదేశం, నాయకత్వం వారి నిర్వాకం ఏమిటో వారివారి విచక్షణకు వదిలివేయడమే. నచ్చితే ప్రజలు మెచ్చుకుని అధికారం అందించడం, నొచ్చితే గద్దెనుంచి దింపివేయడం, రాజకీయంలో అంతర్భాగమే కదా.

జనవరి 18 న నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళిని సమర్పించాల్సిన ఘనతరుణం ఈనాడే. తెలుగువాడికి, తెలుగువేడికి సాక్ష్యంగా, నిదర్శనంగా మనకు నిత్యదర్శనం కావించే నందమూరి భావాభిరామానికి ధన్యవాదాలను సమర్పించుకోవాల్సిన తరుణం.
మరో నందమూరి కొరకు నిరీక్షణ చేద్దాం. మనకు ఆ, అదే నందమూరి తారకరాముడు లభించడం బహు కష్టతరం, క్లిష్టసమం. అయినా నిరీక్షిద్దాం.
కళారాజకీయ రంగాల్లో, మన తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుబిడ్డ నందమూరి ఆత్మకు ఘన నివాళిని తెలుగురథం సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.