Sunday, April 23, 2017

శ్రీమతి S.జానకి గారి 80వ పుట్టిన రోజు


శ్రీమతి ఎస్ జానకి గారి 80 వ పుట్టిన రోజు సందర్భంగా...
(S. Janaki born on 23-04-1938)
ఆమె గొంతు ఓ గంగా ప్రవాహం... ఆమె గానం ఓ మలయమారుతం... ఆమె స్వరం ఓ కోయిల గానం. ఆ స్వరం ఓ సమ్మోహనం... తన పాటకు పగలే వెన్నెల కాస్తుంది... జగమంతా ఊయలలూగుతుంది. ఆమె పలుకు వింటే ప్రకృతి పులకరిస్తుంది. ఆ సుస్వరాల కోకిల వయస్సు 80 ఏళ్లయితే, తన గాత్రం వయస్సు 60 ఏళ్లు. అయినా... ఆమె గొంతులోనూ, గానంలోనూ ఎక్కడా వృద్దాప్య ఛాయలు కనిపించవు. ఆమె మరెవరో కాదు... తన కోకిల స్వరంతో దక్షిణాది శ్రోతలను ఆకట్టుకున్న లెజండ్రీ నేపథ్య గాయని ఎస్.జానకి.
ఎస్.జానకి అంటే.. 'సంగీత జానకి'గా సంగీతాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 15 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు సృష్టించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అనేక భారతీయ భాషలలో తన కమ్మని స్వరంతో వీనుల విందు చేసిన గాయకరత్నం... మన ఆణిముత్యం జన్మదినం నేడు.
గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకా, పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు 1938, ఏప్రిల్ 23న జానకి జన్మించారు. నాదస్వరం విద్వాన్ శ్రీ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి 1957వ సంవత్సరంలో తన 19వ ఏటనే గాయనిగా అవతారమెత్తిన జానకి పాటల రచయిత, సంగీత దర్శకురాలు కూడా. 1956లో రేడియో పాటల పోటీలో పాల్గొన్న జానకి ఆ పోటీలో రెండవ బహుమతి గెలుచుకొని, అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆ సమయంలో ఎం.చంద్రశేఖరం జానకిని మద్రాస్లోని ప్రముఖ సంగీత సంస్థ ఎ.వి.ఎం.కు పరిచయం చేశారు. అదే సమయంలో పి.సుశీలతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పూర్తికావొచ్చిన ఎ.వి.ఎం. వారికి మరో గాయని కావలసివచ్చింది. ఆ సమయంలో వారికి జానకి తటస్థించారు. అప్పటి ఎ.వి.ఎం. నిర్వాహకులను జానకి తన అభిమాన గాయకురాలైన లతామంగేష్కర్ పాడిన 'రసిక్ బల్మా' పాటతో మెప్పించారు. ఇక అక్కడినుంచి జానకి ఎ.వి.ఎం.లో స్టాఫ్ సింగర్ అయ్యారు. మొదట్లో అసలు తమిళమే రాని జానకి మొట్టమొదటిసారిగా తమిళంలోనే పాడారు. అవి రెండూ విషాద గీతాలే. టి.చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన 'విధియిన్ విళైయాట్టు' అనే తమిళ చిత్రంలో 4.4.1957న ఆమె తొలిసారిగా 'పేదై ఎన్ ఆసై పాళా న దేనో' అనే శోకగీతంతో తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు.
5.4.1957న 'ఎం.ఎల్.ఎ.' సినిమా కోసం ఘంటశాలతో కలిసి 'నీ ఆశ అడియాస... చెయి జారే మణిపూస... బ్రతుకంతా అమవాస లంబాడోళ్ల రాందాసా' అనే విషాద గీతం పాడారు. ఇది కూడా విషాద గీతం కావడం యాదృచ్ఛికమే. ఆమె మలయాళంలో పాడిన తొలి గీతం కూడా శోక గీతమే. ఎంవిఎం వారికి తొలిసారిగా సింహళంలో పాడిన పాట కూడా అలాంటి సందర్భంలోనిదేనట. దీంతో 'ఇదేమిట్రా... శుభమా అని సినిమాల్లోకి వస్తే ప్రారంభమే ఏడుపు పాటలు పాడాల్సి వచ్చిందే' అని జానకి ఫీలాయ్యారట. ఆ తర్వాత 'బిడ్డ పుట్టగానే ఏడుస్తూనే కదా లోకాన్ని చూసేది... లోకంలోకి వచ్చేది... ఇదీ అంతే' అని తనని తాను సముదాయించుకున్నారట. ఆమె పాడటం ప్రారంభించిన తొలి సంవత్సరమే(1957) 6భాషల్లో 100పాటలకు పైగా పాడి రికార్డు సృష్టించారు.
మొదట పాడిన పాట ఏదైననూ ఆవిడకు బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది మాత్రము “ నీ లీల పాడెద దేవ “ ఈ పాట కోసము ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు గారు ఒక సన్నాయి లాంటి గళానికి కోసము వెతుకుతుండగా , జానకి గారి మావగారైన డా!చంద్రశేఖర్ గారి ద్వారా ఆవిడ గురించి వినడము , ఆ తరవాత కరైకూచి అరుణాచలం గారి నాదస్వరానికి పోటీ పడుతూ ఆవిడ పాడిన ఆ పాట ఆ నాటి నుండి ఈ నాటి వరకు సంగీతభిమానులను డోళలాడిస్తూనే ఉంది . అటు వంటి పాట ఇంతవరకు ఎవరూ పాడలేదు…….పాడలేరు. ఈ పాట పాటలప్రపంచములో ఒక సుస్థిరస్థాన్నాన్ని ఏరపరచుకొని అభేరీ రాగానికే ‘ ఆభరణం ‘ అయ్యింది.
ఇళయరాజా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ..''జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతిరోజూ కొన్ని లీటర్ల తేనె తాగుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా'' అని జానకి గాత్రంలోని మాధుర్యం గురించి చమత్కరించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గానంలో మాధుర్యం ఎంతో.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, సినాÛలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్, సింహళీ భాషల్లో తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె.జె.జేసుదాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, పి. జయచంద్రన్, పి.లీలా, కె.ఎస్.చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి.శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి.బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పాటు మనో, వందే మాతరం శ్రీనివాస్ వంటి వర్థమాన గాయకులెందరితోనో కలిసి పాడారు.
బిస్మిల్లాఖాన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రముఖ సంగీత విద్వాంసులతోనూ కలిసి పనిచేశారు. ఎస్.రాజేశ్వరరావు, దక్షిణమూర్తి, సుబ్బయ్య నాయుడు, పెండ్యాల, కె.వి.మహదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథం, రాజన్ నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, రమేష్ నాయుడు, జాన్సన్, శ్యామ్, వందేమాతరం శ్రీనివాస్, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి ఎందరో సంగీత దర్శకులకు గాత్రం అందించారు.
ఆరుసార్లు జాతీయ స్థాయిలో గాయనిగా అవార్డు అందుకున్నారు. వాటిల్లో తెలుగులో వంశీ దర్శకత్వంలో ఆమె పాడిన 'సితార' చిత్రంలోని 'వెన్నెల్లో గోదారి అందం' పాటకుగాను ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు అందుకున్నారు.
మహమ్మద్ రఫీ, లతామంగేష్కర్, ఆశాభోంస్లేలు జానకికి ఇష్టమైన సింగర్స్. ఐదు తరాల నటీమణులకు జానకి తన గళాన్ని అందించడం మరో విశేషం. రామోజీరావు నిర్మించిన 'మౌనపోరాటం' చిత్రానికి జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తరం వారిలో భానుమతి, పి.లీల తర్వాత జానకి మాత్రమే మహిళా సంగీత దర్శకురాలు. ప్రస్తుతం ఉన్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు, గాయకురాలు ఎంఎం శ్రీలేఖ మాత్రమే.
ఏ భాషలో పాడినా... పాటలో ఆ నేటివిటీ ధ్వనించేలా పాడగలగడమే ఆమె అందరి అభిమానం చూరగొనేలా చేసింది. ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి వి.రామ ప్రసాద్ ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.
ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడారు.
మౌనపోరాటం సినిమా ద్వారా ఆవిడ సినీ సంగీత దర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు. చాలా కొద్దిమందికే తెలిసిన మరో విద్య కూడా కలదు ఆవిడలో …అవిడ మంచి చిత్రకారిణి కూడా.
ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు.1980-90 దశకంలో విడుదలైన చిత్రాలన్నింటిలో జానకి గాత్రం వినబడేది. బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రం అందించారు. జానకి అద్భుతమైన పాటలనెన్నింటినో వీనుల విందుగా ఆలపించి శ్రోతలను పరవశింపచేశారు.
నీలిమేఘాలలో... గాలి కెరటాలలో (బావామరదళ్లు), పగలే వెన్నెల, జగమే ఊయల (పూజాఫలం), నడిరేయి ఏ జాములో (రంగులరాట్నం), ఆడదాని ఓరచూపులో (ఆరాధన), ఈ దుర్యోధన, దుశ్సాసన, దుర్వినీతి లోకంలో (ప్రతిఘటన), గున్న మామిడి కొమ్మ మీద(బాలమిత్రుల కథ), కన్నె పిల్లవని కన్నులున్నవి (ఆకలి రాజ్యం), సిరిమల్లె పువ్వా (సిరిమల్లె పువ్వా), సందె పొద్దుల కాడా (అభిలాష), మౌనవేలనోయి (సాగర సంగమం), గోవుల్లు తెల్లనా గోపమ్మ నల్లనా (సప్తపది), నీలి మేఘాలలో (బావా మరదలు), నీ లీలా పాడెద దేవ (మురిపించే మువ్వలు), వెన్నెల్లో గోదారి అందం (సితార), గువ్వా గోరింకతో (ఖైదీ నెం.786), మనసా తెళ్లిపడకే (శ్రీవారికి ప్రేమలేఖ), చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య ( స్వాతి ముత్యం ) , పంటచేల్లో పాలకంకి నవ్వింది ( పదహారేళ్ల ) ,గున్నమామిడి కొమ్మ మీద (బాలమిత్రుల కథ )
భళిరా నీవెంత (దేవాంతకుడు), గాజులమ్మ గాజులు (కార్తవరాయని కథ), ఓ వన్నెకాడ (పాండవ వనవాసం), కన్ను కన్ను చేర (అగ్గి పిడుగు), హొయిరే పైరగాలి (గోపాలుడు భూపాలుడు), లడ్డులడ్డులడ్డు బందరు మిఠాయి లడ్డు (అగ్గిపిడుగు ), స స స సారె గ గ గ గారె నీవురంగుల (సవతికొడుకు ), ఉలకక పలుకక ఉన్నతీరే తెలియనీక (టైగర్ రాముడు), నవ భావనలు (టైగర్ రాముడు), జయ గణనాయక విఘ్నవినాయక (నర్తనశాల), ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవిళ్ళు (గోపాలుడు భూపాలుడు ), కలల అలలపై (గులేబకావళి కథ), సలామ లేకుం (గులేబకావళి కథ), ఏమో ఏమో ఇది (అగ్గి పిడుగు), సిలకవే రంగైన మొలకవే (సంగీత లక్ష్మి ),మల్లెలు కురిసే చల్లని వేళలో (అడుగు జాడలు), హిమనగిరీ మధుర (వరూధీనీ ప్రవరాఖ్య, టైగర్ రాముడు ), వల్లభా ప్రియ వల్లభ (శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కథ), కుశలమా (శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కథ), వసంత గాలికి వలపులు రేగ (శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కథ ), కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో (లక్ష్మీ కటాక్షం ), చిరునవ్వుల చినవాడే పరువంలో (పవిత్ర హృదయాలు ), త ధిన్ ధోన ( ధిల్లానా , ఉమా చండీ గౌరీ శంకరుల కథ ), అలుకమానవే (శ్రీ కృష్ణ సత్య), ఎంత మధుర సీమ (దేవాంతకుడు), భళారే వీరుడు నీవేరా (దేవత), వలపులోని (తోడు నీడ), రారా ఇటు రారా (దాన వీర శూర కర్ణ),చెడు అనవద్దు (మేలుకొలుపు),పాలరాతి బొమ్మకు (అమ్మాయి పెళ్ళి), నిద్దురపోరా సామీ (కోడలు దిద్దిన కాపురం),సరి లేరు నీకెవ్వరు (కంచు కోట), ఏమోఏమో ఇది నాకేమో ఏమో ఐనది (అగ్గిపిడుగు ), ఎవరనుకున్నావే (అగ్గి పిడుగు), ఓహో హోహో రైతన్నా (విజయం మనదే ), కదలించే వేదనలోనే ఉదయించును (సంగీత లక్ష్మి ), నేటికి మళ్ళీ మా ఇంట్లో (వాడే వీడు), ఎనలేని ఆనందమీ రేయీ (పరమానందయ్య శిష్యుల కథ ), ఎవ్వరో పిలిచినట్టుటుంది (విజయం మనదే ), పలికేది నేనైనా పలికించేది నీవేలే (పవిత్ర హృదయాలు ), భువనమోహినీ అవధిలేని యుగయుగాల (భామావిజయం ), ఎన్నాళ్ళకెన్నాళ్లకు (అడవి రాముడు), నరవరా కురువరా (నర్తనశాల) వంటి ఎన్నో వైవిధ్యభరితమైన పాటలను తన సుస్వరంతో ఆలపించి వీనుల విందు చేశారు.
kameswara rao anappindi