సంగీతం::సాలూరు హనుమంతరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,గుమ్మడి,B.సరోజాదేవి,కృష్ణంరాజు,విజయలలిత,అంజలిదేవి,
పల్లవి::
అహో హిమపన్నగము భరతావనికే తలమానికమూ
అహో హిమపన్నగము భరతావనికే తలమానికమూ
అంబరచుంబి శిఖరాలు సరజ్ఝరీ తరంగాలు
అంబరచుంబి శిఖరాలు సరజ్ఝరీ తరంగాలు
ఆ..అభంగ తరంగ మృదంగ రవముల
అభంగ తరంగ మృదంగ రవముల
కభినయమాడు మయూరాలు అహో హిమపన్నగము
భగీరధుడు తపియించిన చోటు గగన గంగనే దింపిన చోటు
పరమేశుని ప్రాణేశుగ బడలీ పరమేశుని ప్రాణేశుగ బడలీ
గిరినందన తరియించిన చోటు
అహో హిమపన్నగము
భరతావనికే తలమానికమూ అహో హిమపన్నగము
సిద్దుడిచ్చిన కాలిపసరుతో సిద్దించెను వాంచితమ్ము
పుణ్యతీర్థ సందర్శనమ్ముతో పునీతమాయేను జీవితమ్ము
అయ్యయ్యో కాలి పసరు కరిగిపోయెనే
ఇంటికేగు తెరువు ఎరుగనైతినే
ఎక్కడి మా అరుణాస్పదపురము
ఎక్కడి ఈ హిమ పన్నగవరము?
కోరి వచ్చినాను దారి కోలుపోయినాను
ఎగిరిపోదమన్న నాకు రెక్కలైన లేవే
ఏ దిక్కు కానరాదే ఏ దిక్కు కానరాదే
ఎక్కడివాడో యక్ష తనయేందు జయంత వసంతకంతులన్
చక్కదనంబునన్ గెలువజాలెడివాడు మహీసురాన్వయం
బెక్కడ యీ తనూ విభవమెక్కడ యేలనిబంటుగామరున్
దక్కగొసంగరాదే అకటా ననువీడు పరిగ్రహించినన్ ఎక్కడివాడో
ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ
ఒంటిజరించెదు ఓటలే కివ్వనభూమి భూసురుడ నేప్రవరాఖ్యుడ
త్రోవతప్పితిన్ గ్రొవ్వున ఇన్నగాగ్రమునకున్ జనుదెంచి
పురంబుజేర నిం కెవ్విధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర,
యే కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు
లా గింతియగాక నీ వెఱుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ కింత
భయంబులేకడుగ ఎల్లిదమైతిమె మాటలేటికిన్
ఎంతమాట ఈ ప్రవరు డట్టివాడు కాడే
చతురుడవే అడుగకయే నీ పేరుచెప్పిన ఆ తీయని నోటితో
నా పేరడుగవైతివే వరూధిని అప్సరో శిరోమణిని
దివినుండి ఈ భువికి దిగివచ్చినాను నీ మదన రూపమ్ము
నేమెచ్చినాను మనసిచ్చినాను
వరూధినీ
అహా..ఎంత కమ్మని పిలుపు ఎన్ని మరులను గొలుపు
ఈ పూల పొదరింట చూపించు నీ వలపు
శ్రీహరీ..శ్రీహరీ..అపచారం అపచారం
వరూధినీ కలనైనా పరకాంతను తలచియైనా
ఎరుగనివాడను నిత్యాగ్నిహోత్రిని నిష్ఠా గరిష్ఠుడను
ఓ అభినవ మదనా నీ యజ్ఞయాగములు నీ జపతపములు
స్వర్గసౌఖ్యములు పొందుటకేగదా ఆ సౌఖ్యమేదో నీ ముందు
నా యందు లభించనుండగా ఆలసింతువేల అనుభవించరావేల
హరీ....శ్రీహరీ
ఓ సుందరా నే నోపలేనురా ఈ మరుని తొందరా
ఓ సుందరా నే నోపలేనురా ఈ మరుని తొందరా
నిట్టూర్పు సెగలతో కందెను నా అధరమూ
ఎదపొంగులతో సడలెను నీవీ బంధమూ
మేనిలోన చెలరేగెను కానరాని తాపమూ
ఇకనేను సైపలేను ఈ విరహదాహము
సైపలేను ఈ విరహదాహమూ
శ్రీహరీ...శ్రీహరీ
పాటున కింతులోర్తురే కృపా రహితాత్మక
నీవు త్రోవ యిచ్చోట యిచ్చొట యిచ్చోట
భవన్నఖాంకురము సోకే కనుంగొనుము అకటా
వనిత తనంత తా వలచి వచ్చిన చుల్కనగాదే ఏరికిన్
దాన జపాగ్ని హోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండనేని పరదారధనాదుల గోరనేని
సన్మానముతోడ నన్ను వదనంబుననిల్పుము ఇనుండువశ్చిమాం
భోనిధిలోన గ్రుంకకయమ్మున్న రయంబున హవ్యవాహనా
నీవేనా స్వామీ నీవేనా ఇది నిజమేనా మరి కలయౌనా
కాదు నిజమే నేను చూస్తున్నది నిన్నే
ఏలరా యీ చలమేలరా ఏలరా
యీ చలమేలరా ఏలరా యిక నన్నేలరా
పాలవెన్నెల నురుగుల కెరటాలలో
మాలతీలతా నికుంజాలలో
పాలవెన్నెల నురుగుల కెరటాలలో
మాలతీలతా నికుంజాలలో
ఏలరా యికనైన ఏలరా
నీ వెక్కడా నే నెక్కడా దివి ఎక్కడా భువి ఎక్కడా
ఆ నింగికి యీనేలకు ముడివడే దెట్టుల?
నీ కనులు కనికరించితే మనసు సమ్మతించితే
దివిని మరచి భువినే వలచేనురా
ఈ భువినే ఆ దివిగ మలచేనురా
గాలి తాకిడికే కందే నీ చెక్కిళ్ళు
పూల తొక్కిడికే బొబ్బలెత్తే అరికాళ్ళు
ఇంతటి సుమకోమలివే అంతటి స్వర్గాలు వీడి
ఇంతటి సుమకోమలివే అంతటి స్వర్గాలు వీడి
ఎటుల నిలువగలవు ఈ లోకంలో నరలోకంలో
నీదాననైనా చాలురా నేను నీదాననైనా చాలురా
నీవు నా వడవైతే పదివేలురా నేను నీదాననైనా చాలురా
నీ పద ధూళిగ నిలిచిననాడు నీ పద ధూళిగ నిలిచిననాడు
నరకమైన అది నందనవనమేరా నరకమైన అది నందనవనమేరా
నీదాననైన చాలురా నేను నీదాననైన చాలురా