Tuesday, June 13, 2017

D.C.నారాయణ రెడ్డి గారికి అశ్రునివాళి


జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత.. ప్రముఖ కవి.. 
గీతరచయిత డా. సి. నారాయణ రెడ్డి గారికి అశ్రునివాళి 

సి నారాయణ రెడ్డి (29-07-1931 & 12-06-2017)
సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి (జూలై 29, 1931 - జూన్ 12, 2017)గారు తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యారు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యారు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు.
ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.
ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవారు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది.
ఆయనది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి.
1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించారు. అందులో బహుళ ప్రాచుర్యం పొందిన కొన్ని పాటలు
1962 ఆత్మబంధువు అనగనగా ఒక రాజు, అనగనగా ఒక రాణి, చదువురాని వాడవని దిగులు చెందకు
1962 గులేబకావళి కథ నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
1962 రక్త సంబంధం ఎవరో నను కవ్వించి పోయేదెవరో
1963 బందిపోటు వగలరాణివి నీవే సొగసుకాడను నేనే
1963 కర్ణ గాలికి కులమేది నేలకు కులమేది
1963 లక్షాధికారి దాచాలంటే దాగవులే దాగుడుమూతలు సాగవులే, 
1963 తిరుపతమ్మ కథ పూవై విరిసిన పున్నమివేళా బిడియము నీకేలా 
1964 గుడి గంటలు నీలి కన్నుల నీడల లోనా
1964 మంచి మనిషి అంతగా నను చూడకు మాటాడకు, వింతగా 
1964 రాముడు భీముడు తెలిసిందిలే నెలరాజ నీరూపు తెలిసిందిలే
1965 మంగమ్మ శపథం కనులీవేళ చిలిపిగ నవ్వెను
1966 పరమానందయ్య శిష్యుల కథ నాలోని రాగమీవె నడయాడు తీగ
1968 వరకట్నం ఇదేనా మన సాంప్రదాయమిదేనా
1969 ఏకవీర కృష్ణా నీ పేరు తలచినా చాలు
1970 కోడలు దిద్దిన కాపురం నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు 
1970 లక్ష్మీ కటాక్షం రా వెన్నెల దొరా కన్నియను చేరా
1971 చెల్లెలి కాపురం కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా
1971 మట్టిలో మాణిక్యం రింఝిం రింఝిం హైదరబాద్
1972 బాలమిత్రుల కథ గున్న మామిడి కొమ్మ మీదా గూళ్లు రెండు
1972 మానవుడు దానవుడు అణువూ అణువున వెలసిన దేవా కను
1972 తాత మనవడు అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
1973 శారద శారదా, నను చేరగా ఏమిటమ్మా సిగ్గా, ఎరుపెక్కే లేత బుగ్గా
1974 అల్లూరి సీతారామరాజు వస్తాడు నా రాజు ఈ రోజు
1974 కృష్ణవేణి కృష్ణవేణి, తెలుగింటి విరిబోణి, కృష్ణవేణి, నా ఇంటి అలి
1974 నిప్పులాంటి మనిషి స్నేహమేరా నా జీవితం స్నేహమేరా 
1974 ఓ సీత కథ మల్లెకన్న తెల్లన మా సీత మనసు
1975 అన్నదమ్ముల అనుబంధం ఆనాటి హృదయాల ఆనంద గీతం 
1975 ముత్యాల ముగ్గు గోగులు పూచే పూగులు కాచే ఓ లచ్చ గుమ్మడీ
1976 తూర్పు పడమర శివరంజనీ నవరాగినీ వినినంతనే నా
1978 శివరంజని అభినవ తారవో నా అభిమాన తారవో, జోరుమీదున్నా
1984 మంగమ్మగారి మనవడు శ్రీ సూర్యనారాయణా మేలుకో
1985 స్వాతిముత్యం లాలి లాలి లాలీ లాలి, వటపత్రశాయీ వరహాల 
1997 ఒసే రాములమ్మా ఒసే రాములమ్మా
2001 ప్రేమించు కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత 
2003 సీతయ్య ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగు 
2009 అరుంధతి జేజమ్మా జేజమ్మా....
ఆయనకు సద్గతులు కలగాలని ఆశిస్తూ


పాటలా...అవి కావు నవ పారిజాతాలు! రసరమ్య గీతాలు!!
అది...ప్రేయసీ ప్రియులు పాడుకునే యుగళగీతం. నటించేది ఎన్టీఆర్‌, జమున. తోటలో మాల కడుతూ ఎదురుచూస్తున్న ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? ‘తోటలో తొంగి చూసిన’ ఆ రాజు నవ్వులు ఆమెకెలా అనిపిస్తాయి?
‘నవ్వులా? అవి కావు...నవపారిజాతాలు...
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు...’లా కనిపిస్తాయిట!
మరి అంతటి ప్రేమను ఆమెలో చూసిన ఆ రాజు ఏం చేశాడు?
‘ఎలనాగ నయనాల కమలాలలో దాగి...
ఎదలోన కదిలే తుమ్మెద పాట...’ విన్నాడు!
‘ఆ పాట నాలో తియ్యగ మోగనీ... అనురాగ మధుధారలై సాగనీ...’ అన్నాడు!
‘ఏకవీర’ చిత్రంలో ‘తోటలో నా రాజు...’ పాట అటు రసజ్ఞులను, ఇటు సామాన్యులను కూడా ఒకేలా ఆకట్టుకుంది.
* మరో సందర్భం... అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశం. దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ ధీరగంభీరంగా నడుస్తూ వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.
‘శత సోదర సంసేవిత సదనా... అభిమానధనా... సుయోధనా...’ అంటూ స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో ఆ సందర్భాన్ని సుసంపన్నం చేసింది.
‘ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా...’ అని సంబోధించింది.
‘కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు సౌర్యాభరణా...’ అని మెచ్చుకుంది. ‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలో ఇలాంటి పదాలతో సాగిన ఈ పాట కూడా నేల ప్రేక్షకుడి చేత ఈలలు వేయించింది.
* హీరో హీరోయన్‌తో కలసి విహార యాత్రకు వెళ్లే సందర్భంలో పాట రాయాల్సి వస్తే ఇంకెవరైనా అయితే శృంగార పరంగా రాస్తారు. కానీ సినారె ఆ సందర్భానికి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. శోభన్‌బాబు నటించిన ‘విచిత్ర కుటుంబం’లోని ‘ఆడవే జలకమ్ములాడవే... కలహంస లాగ... జలకన్య లాగ...’ అంటూ మొదలు పెట్టి...
‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల...’లోను, ‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట...’, ‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు...’ -సాహిత్యాన్ని జలకాలాడించారు! సినిమా పాట చేత పుణ్యస్నానాలు చేయించారు!!
* తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె.
*‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు.
*వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. 
‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. 
‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’లో కళ్లకుకట్టారు.
*‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా,
‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్‌..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘
చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.
*‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో.
‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో.
‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు.
‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు.
* ఇలా ఎన్నెన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి.
‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ...’ పాట విన్నా, ఇలా ఒకటా రెండా ఏ పాటను గమనించినా... అవన్నీ చిత్రసీమలో ‘చిత్రం... భళారే విచిత్రం...’ అనిపించేవే. ‘ఛాంగురే... భళారే... సినారె’ అనిపించేవే!!
*గీత రచయితగా సి.నారాయణరెడ్డి ప్రయాణం ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘గులేబకావళి కథ’తో ప్రారంభమైంది. తొలి చిత్రంలోనే సినారె మొత్తం పాటలన్నీ రాశారు. ‘గులేబకావళి కథ’ కోసం పాటలు రాయడానికని సినారె హైదరాబాదు నుంచి మద్రాసుకి వెళ్లగా, ఎన్టీఆర్‌ స్వయంగా రైల్వే స్టేషన్‌కి వెళ్లి, తన సొంత కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లారట. 1961మార్చి 10న సినీ గీత రచనని ఆరంభించారు సినారె. పది రోజుల్లోనే, మొత్తం పది పాటల్ని పూర్తి చేశారు. ఆ పది రోజులు కూడా ఎన్టీఆర్‌ ఇంట్లోనే భోజనం చేశారు. షూటింగ్‌ పూర్తి కాగానే నేరుగా సినారె దగ్గరికి వెళ్లి, ఆయన రాసిన పాటలు విని, భోజనానికి ఇంటికి తీసుకెళ్లేవారట ఎన్టీఆర్‌. ఆపై ఎన్టీఆర్‌ నిర్మించిన ప్రతి చిత్రంలోనూ సినారె గీతాలు రాశారు. తాను గీత రచయితగా మారిన సందర్భం గురించి ఓ ఇంటర్వ్యూలో సినారె చెబుతూ ‘‘నాకు అంతకు ముందే పాటలు రాసే అవకాశాలు వచ్చాయి.
‘శభాష్‌ రాముడు’, ‘పెళ్ళిసందడి’ చిత్రాల్లో పాటలు రాయమని అడిగారు. అయితే ఒకట్రెండు పాటలే రాయమని చెప్పేవారు. కానీ నాకది ఇష్టం ఉండేది కాదు. రాస్తే అన్ని పాటలు రాయాలనేది నా అభిమతం. ఎన్టీఆర్‌తో కూడా అంతకుముందు ముఖపరిచయం ఉంది. ఆయన హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రీకరణలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సందర్భంలోనే నాకు కబురు పెట్టారు. వెళ్లగానే ‘మీ గురించి వింటున్నాను. మీ గేయాలు పత్రికల్లో అప్పుడప్పుడు చూస్తున్నా. మీరు పాటలు రాయాలి’ అన్నారు. ‘మొత్తం పాటలన్నీ నాతోనే రాయిస్తే, రాస్తానండి’ అని చెప్పా. ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్‌ వచ్చినప్పుడు నాకు కబురు పెట్టారు. ‘‘గులేబకావళి కథలో అన్ని పాటలూ మీరే రాయాలి’’ అన్నారు. అలా మద్రాసు వెళ్లినప్పుడ గుమ్మడి, మిక్కిలినేని, సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి నాలుగు కార్లతో ఎన్టీఆర్‌ స్వయంగా మద్రాసు స్టేషనుకొచ్చి నన్ను సాదరంగా తీసుకెళ్లి, అందరికీ పరిచయం చేశారు. 
*దుర్యోధనుడికి యుగళ గీతం: ఎన్టీఆర్‌ చిత్రాల్లో ‘దానవీర శూరకర్ణ’ది ప్రత్యేక స్థానం. అందులో దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ నటన ఎంత బాగుంటుందో.. ఆ చిత్రంలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాట కూడా అంతే సూపర్‌ హిట్‌. దుర్యోధనుడికి ఓ యుగళ గీతం పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఎన్టీఆర్‌కే వచ్చిందట. వెంటనే సినారెతో ఆ విషయాన్ని చెప్పారు. ‘ఏం కవిగారూ దుర్యోధనుడికి ఈ చిత్రంలో ఓ యుగళ గీతం పెడితే ఎలా ఉంటుంది’ అని అడిగితే బాగుంటుందని సినారె చెప్పారు. దాంతో ఆ పాట రాసే బాధ్యత కూడా సి.నారాయణరెడ్డికే అప్పగించేశారు ఎన్టీఆర్‌. సాహిత్యంలో ఇష్టమొచ్చిన పద ప్రయోగాలు చేసుకోమని కూడా చెప్పేశారట ఎన్టీఆర్‌. అలా ‘చిత్రం భళారే..’ పాటకు అంకురార్పణ జరిగింది. ఆ పాటలోని సాహిత్యం రామారావుగారిని ఎంతగానో ఆకట్టుకుందని చాలాసార్లు చెప్పారు సినారె. (Courtesy: Eenadu cinema 13-06-2017)Kameswara Rao Anappindi